సమీక్ష:
మౌనసాక్షి – కథల సంపుటి
-రచయిత – నక్షత్రం వేణుగోపాల్
సాహితీ క్షేత్రంలో విరబూసినదొక నవ పారిజాత కథా సుమూహారం నక్షత్రం వేణుగోపాల్ రాసిన మౌనసాక్షి. పొగడ్తల కోసమో, మెప్పుకోసమో రాసిన కథలుగా లేవు. వాస్తవసంఘటనల ప్రతిరూపాలు. నేటి సమాజంలోని ఘర్షణలను ఒడుదుడుపులను స్పృజిస్తూ తెలంగాణ సాహితీ లక్ష్మీకి నుదుట తిలకం దిద్దినట్టున్నదీ మౌనసాక్షి. కథలన్నీ పుట్టెడు భావోద్వేగాలతో, గంపెడు ఆవేదనతో పరిణామాల ఒత్తిడికి పెల్లుబుకిన తపణతో అశక్తునిగా ఓ మౌనసాక్షిగా నిలిచాడు రచయిత. లఘుచిత్రాల స్క్రీన్‌ప్లే అనుభవంతో సన్నివేశాలు, సంభాషణలు, నిజదృశ్యములుగా పాఠకున్న ఆసాంతం చదివిస్తాయి.
ఈ కథల సంపుటిలో ఉన్న పదకొండు కథలు రచయిత పరివేదనను ప్రతిబింబిస్తున్నాయి. రెండు దశాబ్దాల సామాజిక విప్లవోద్యమాలతో కలిసి నడిచిన భావికుడు నక్షత్రం వేణుగోపాల్. కళ్లనిండా కలలతో, మనసు నిండా భావోద్వేగాలతో, జీవితమంతా ఆకాంక్షలతో ఉప్పొంగి ఊగిన ఊహాజీవి. వేణు రచయితగా కుదురుకుని, తనను తాను ఓదార్చుకొని తనలో తొంగి చూసుకొని రాసి కథలివి. ‘పర్యవసానం’, ‘అశృవొక్కటి విప్లవ నేపథ్య కథలైన అరుణ పాత్రలోని అంతర్మదనం ఓ సంస్కార కథకు నాందీ పలికింది.
చదువుకు మార్కులే కొలమానం కాదు అని తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించే మంచి కథ ‘వేక్ఆప్’ బాగుంది. ‘పిలుపు’, ‘నాతిచరామి’, ‘సూపర్ హీరో’, ‘వెలితి’ తెలుగు ప్రవాస భారతీయుల కుటుంబ సంబంధాలను చక్కగా ఆవిష్కరించారు. ప్రేయసి నిజప్రేమ త్యాగాన్ని ‘కౌముది’లో రక్తికట్టించారు. ‘కౌముది’లోని సంభాషణలు మొన్నటి బాహుబలి నేటి స్వర్ణఖడ్గంలా చలన చిత్రం తీయవచ్చు. ‘నాతిచరామి’ నాటిక రాస్తే బాగుంటుంది. అన్ని కథలలో మకుటాయమానమై, కలికితురాయిగా నిలిచిన కథ ‘నాతిచరామి’ ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. కళ్లు చమర్చుతాయి. చివరలో పావని తన నిర్ణయంతో స్వేచ్చ ప్రపంచంలోకి వెళుతుంది. కాని, రమేష్ కు ఆ శిక్ష సరిపోదు. మరొక స్త్రీకి అన్యాయం చేయడానికి ఆస్కారం ఉంటుందని అనిపించింది.
వేణునక్షత్రం తెలంగాణ కథకు కొత్త కాంతినద్దుతూ వెలుగిస్తున్న కథా సంపుటి ‘మౌనసాక్షి‘. ఇష్టంగా ఈ కథలు చదివితే మనుషులూ ఎవరైనా మరింత మానవీయంగా తయారవుతారని భావించవచ్చు. ఎక్కడో అమెరికాలో స్థిరపడినా మాతృభాష, దేశంపైగల మక్కువతో తనవంతు సాహితీ సేద్యం చేస్తున్న ఈ యువరచయిత వేణునక్షత్రం కలం నుంచి మరెన్నో మంచి కథలు ఆశించవచ్చు.
– రమణస్వామి ముక్తవరం
మౌనసాక్షి – కథల సంపుటి
రచయిత: వేణుగోపాల్ నక్షత్రం
రచయిత మెయిల్: nakshathram@gmail.com
పేజీలు: 144
వెల: 100
ప్రతులకు: విశాలాంధ్ర , నవచేతన బుక్ హౌస్ ( అన్ని బ్రాంచీలు)
కినిగే ఆన్‌లైన్ బుక్ పోర్టల్‌లో లభ్యం http://kinige.com/book/Mounasakshi
https://www.amazon.in/dp/B07MXV2WH3?ref=myi_title_dp&fbclid=IwAR0bjMZ9wTJIkooOaROTh_RYM9s4dg3oMbCB38ddKxVvibpxzmVIEmU_tu0
Amazon India:
http://bit.ly/Mounasakshi