* కథ -వేణు నక్షత్రం
nakshathram@gmail.com
“పునాస” తెలంగాణ సాహిత్య అకాడమీ – అధికారిక త్రైమాసిక పత్రిక (ఏప్రిల్ -జూన్ 2019) సంచికలో వేణు నక్షత్రం రాసిన కథ – “రేస్” తెలంగాణ సాహిత్య అకాడమీ సంపాదక వర్గానికి ధన్యవాదాలతో..
అది అరోరా మెడికల్ కాలేజ్ బెంగళూరు క్యాంపస్. రయ్యిమంటూ గేటులోంచి దూసుకు వచ్చింది ఒక ఇన్నోవా వ్యాన్. ఆ వ్యాన్ ఎప్పుడొస్తుందా అని గేటు వైపే ఎదురు చూస్తున్న గురు, బయటే ఆగుతుందనుకున్న వ్యాన్ లోపలికి దూసుకు రావడంతో కొంత అసహనానికి గురయ్యి పరుగెత్తు కెళ్లి వ్యాన్ ని గేటు బయటకు తీసుకు వెళ్ళమన్నాడు. తెల్లటి చొక్కా, తెల్లటి ప్యాంటు ధరించిన గురు తండ్రి రఘురాం కారులోంచి దిగుతూ నల్లటి రేబాన్ అద్దాలు తీస్తూ గురుని దగ్గరకు తీసుకోవటానికి ప్రయత్నిస్తుంటే… “ఎన్ని సార్లు చెప్పాలి డాడీ వ్యాన్ ని బయటే పార్క్ చేయమని, లేదా హై ఎండ్ కారు అయినా కొనమని ” నిష్టూరంగా అంటూ దూరంగా నిల్చున్నాడు గురు.
ఆడీలు, మెర్పిడిస్ లలో మాత్రమే తిరిగే తన ఫ్రెండ్స్ రహీం, దీపు ఈ టొయోటాని చూస్తే తన పరువు పోతుందని బాధ. గురు పూర్తి పేరు గురుచరణ్, అప్పుడే రెండవ సంవత్సరం లోకి అడుగు పెడుతున్న మెడికో. కొడుకుని చూద్దామని హైదరాబాద్ నుండి వస్తే కొడుకు ఇచ్చిన టైం రెండు నిముషాలు, ఆ రెండు నిమిషాలు తన ఫ్రెండ్స్ ఎవరూ వాళ్ళ వ్యాన్ చూడొద్దు అనే కంగారే ఎక్కువ.
కోట్ల డబ్బులుంటేనే మెడికల్ సీటు ‘వచ్చే’ అనడం కంటే సీటు ‘ఇచ్చే’ మెడికల్ కాలేజీ అది. ప్రపంచంలో ఉన్న అన్ని బ్రాండెడ్ కంపెనీ ప్రొడక్ట్స్ ని చూడాలనుకుంటే కేరాఫ్ అడ్రస్ ఆ కాలేజీ. లూయీ విటా, జిమ్మీ చూ, గూచీ ఇలా ఎవరి షర్ట్స్, ప్యాంట్స్, చెప్పులు చూసినా ఏదో ఒక బ్రాండెడ్ ఐటెం కనపడుతుంది. రోలెక్స్ వాచీలు,హుబ్లీ, ఏపీ వాచీలు మొదలు కొని సుజుకి హయాబూసా మోటార్ సైకిల్స్ వరకు అన్నీ చూడవచ్చు ఈ కాలేజీ క్యాంపస్ లో! అంటే ఆ కాలేజీలో ఎలాంటి వారు చదువు కోవడానికి వస్తారో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులు గా వచ్చి డాక్టర్లు గా కాలేజీ నుండి తిరిగి వెళ్లే వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువ.
ఈ కాలేజీలో చేరిన తర్వాత బాగా దగ్గరయిన మిత్రులు ముగ్గురు గురు, రహీం మరియు దీపు అని పిలవబడే ప్రదీప్. వాళ్ళు ముగ్గురూ హైదరాబాద్ వాళ్లు కావడమే వారు దగ్గరవడానికి కారణం. గురు తండ్రి రఘురాం ఒకప్పుడు పేరున్న టెన్నిస్ ప్లేయర్, ఇప్పుడు టెన్నిస్ కోచ్. రహీం తండ్రి హైదర్ అలీ ఎంపీ, దీపు తండ్రి రాజారెడ్డి హైదరాబాద్ లో ఒక పేరున్న సివిల్ కాంట్రాక్టర్ అండ్ బిజినెస్ మాన్. హైదరాబాద్ సెంటర్ లో పేరు మోసిన ఒక పెద్ద షాప్పింగ్ మాల్ కి ఓనర్ కూడా. హైదర్ అలీ, రాజారెడ్డి ఇద్దరు కూడా వారి రాబోయే కొన్ని తరాలు అంతా కూర్చుని తిన్నా తరగని సంపాదన ఆల్రెడీ ఉన్నా, పిల్లలు, భార్య ఉన్నారు అనే విషయం దాదాపుగా మర్చి పోయి, వాళ్ళతో గడిపే సమయాన్ని కూడా ఇంకా సంపాదించడం లోనే కేటాయిస్తున్నారు.
గురు తండ్రి టెన్నిస్ ఆడుతూ, యాడ్స్ తో బాగానే సంపాదించినా రాజకీయనాయకుల సంపాదనతో పోల్చలేము కదా! చాలా క్రమ శిక్షణ గల వ్యక్తి. పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకపోయినా ఖరీదయిన చదువు అంటే మెడిసిన్ లాంటి కోర్సుల్లో చేర్చితే వారికి ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చిన వారం అవుతామని ఆలోచించే మనస్తత్వం. తన స్థాయికి పేమెంట్ కోటాలో మెడిసిన్ చదివించడం ఎక్కువే అయినా కొడుకు భవిష్యత్తు కోసం తప్పదన్నట్లు మెడిసిన్ చదివిస్తున్నాడు. కోటి రూపాయలకు పైగా పెట్టి కొన్న మెడికల్ కాలేజీ సీటు ఒక పెద్ద సాహసమే ఆయన సంపాదనకి. “బీఎం డబ్ల్యూ” గాని “ఆడి” కారు గానీ కొనమని చాలా సార్లు గురు చెప్పినా కొనక పోవడానికి అంతఆర్ధికస్తోమత లేకపోవడమే,కానీ ఆ విషయం గురుకి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు.
రహీం తండ్రి పార్లమెంట్ జరిగినా, జరగక పోయినా ఎక్కువ టైం ఢిల్లీ, ముంబై లాంటి సిటీస్ లోనే గడుపుతాడు. పదవిలోకి వచ్చిన కొద్దీ రోజుల్లోనే, విల్లాస్ కంస్టక్షన్ బిజినెస్ స్టార్ట్ చేసి, అన్ని మెట్రో సిటీస్ కి బిజినెస్ ఎక్సాండ్ చేసాడు. రహీంకి ఇంకో తమ్ముడు, ఇద్దరు అక్కలు. వాళ్ళ అమ్మ చాలా పేద ఫ్యామిలీ నుండి వచ్చింది, డబ్బు విలువ బాగా తెలిసిన వ్యక్తి, వృధా ఖర్చులు చేయదు. పిల్లలకు వారు ఎలాంటి పరిస్థితి నుండి ఈ స్టేజ్ కి వచ్చారో తెలియదు. అటు తండ్రి ప్రభుత్వ అధికారాన్ని, ఇటు డబ్బు పవర్ ని వీలయినన్ని చోట్ల వినియోగిస్తారు పిల్లలు. తల్లి చాలా సార్లు చెప్పి చూసింది అది మంచి పద్ధతి కాదు అని, ఆమె చెప్పే మాటలు ఎవ్వరూ వినరు, దానికి తోడు ఆమె పెద్దగా చదువుకోలేదనే చిన్నచూపు.
దీపు అమ్మ శారద కూడా వాళ్ళ గ్రూప్ అఫ్ కాలేజెస్ కి చైర్ పర్సన్, తీరిక లేకుండా కాలేజీ పనులు చూసుకుంటుంది. వీకెండ్ వచ్చింది అంటే ఏదో ఒక క్లబ్ లో ఫ్రెండ్స్ తో మీటింగ్ పేరుతో పార్టీలు.
ఒక విధంగా చెప్పాలంటే ఒకే ఇంట్లో ఉంటున్న ఆ ముగ్గురు కలిసి మాట్లాడుకునేది నెలలో ఏ ఒకటో రెండు సార్లు మాత్రమే.
గురుకి మెడిసిన్ లో చేరడం, కష్టపడి చదవడం అసలు ఇష్టం లేదు. మొదటి నుండి హైదరాబాద్ లో ఫేమస్ అయిన పారాయణ కాన్వెస్ట్ స్కూల్ అండ్ కాలేజ్ స్టడీ వల్ల, దాదాపు ఎంటర్టైన్మెంట్ నిల్. “కష్టపడి మెడిసిన్ చదివితే భవిష్యత్తు చాలా బాగుంటుంది, సాఫ్ట్వేర్ జాబ్ అయితే జీవితం అంతా కొత్త సాఫ్ట్వేర్ కి అప్డేట్ అవుతూనే ఉండాలి, మళ్ళీ ప్రాజెక్ట్ వచ్చినప్పుడే పని” అని రోజుకొక్క సారి అయినా చెపుతుండే వాడు వాళ్ళ డాడీ. “అసలేంటో ఇప్పటి తల్లితండ్రులకి డాక్టర్ , ఇంజనీర్ తప్ప వేరే ప్రొఫెషన్ ఏదీ కనపడడం లేదు” తనలో తనే చాలా సార్లు అనుకునేవాడు గురు.
సమ్మర్ హాలిడేస్ లో ప్రయివేట్ క్లాసెస్, ఒకటి రెండు మూవీస్ చూడడమే ఎక్కువ. మెడిసిన్ ఇష్టం లేదు అని ఒకటి రెండు సార్లు వాళ్ళ అమ్మ గౌరి తో అన్నాడు గురు, స్కూల్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తుంది గౌరి. ఇంట్లో అడ్మినిస్ట్రేషన్ అంతా మాత్రం రఘురాం చేతుల్లోనే! గురు చదువు గురించి చెప్పడానికి ప్రయత్నించింది, కానీ ఆమె మాటను ఎప్పుడు విన్నాడు కనక రఘురాం! గురుకి స్పోర్ట్స్ అస్సలే ఇష్టం లేదు అనడం కన్నా చదివే సమయమే తప్ప ఆడే సమయం దొరికితే కదా? ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్లో స్పోర్ట్స్ అంటేనే అవసరంలేని ఒక ఆక్టివిటీ అయిపోయింది.
నెంగుళ
రఘురాం ఒక స్పోర్ట్స్ మాన్ అయ్యుండి కూడా, స్కూల్ లో ప్లే గ్రౌండ్ లేకపోయినా తన కొడుకు డాక్టర్ కావాలనే ఆశ, ఆశయం స్కూల్ మానేజ్మెంట్ తో స్పోర్ట్స్ గురించి ఎప్పుడూ మాట్లాడనివ్వలేదు. మాథెమాటిక్స్ అంటే ఇష్టం, ఇంజనీరింగ్ చేసి సివిల్స్ రాద్దామనుకున్నాడు గురు. డాక్టర్ కావడానికి ఇంకో పదేళ్లు చదివే ఓపిక అయితే లేదు. బెంగుళూర్ లో మొదటి సారి ప్రతి రోజూ చదువూ, చదువూ అని వెంటపడే వాళ్ళు ఎవరూ లేరు. వచ్చిన ఈ అవకాశాన్ని వదలకుండా జీవితంలో మొట్టమొదటి సారి వీలయినంత వరకు లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకున్నాడు. మెడిసిన్ చేయడం నాతో కాదు అనే విషయం వాళ్ళ డాడీ తో చెప్పలేక, ఇటు చదవలేక మొత్తానికి ఒక సంవత్సరం గడిచి పోయింది. కష్టపడి చదువుమన్న వాళ్ళ డాడీ “నీకు ఇష్టమైన చదువే చదువు” అని మాత్రం ఎప్పుడూ చెప్పలేదు.
మొదటి సంవత్సరం అయిపోయి ఒక నెల హాలిడేస్ తర్వాత రెండవ సంవత్సరం లోకి అడుగు పెడుతూ మళ్లీ కాలేజీ హాస్టల్ కి చేరుకున్నారు ముగ్గురు మిత్రులు. గురు వాళ్ళ ఫ్యామిలీ తో కులుమనాలి కి వెళితే, రహీం మిత్రులతో గోవా టూర్. దీపు మాత్రం కేరళలో ఒక ఖరీదయిన రిసార్ట్ లో జరిగిన తన కజిన్ డెస్టినేషన్ వెడ్డింగ్ అటెండ్ అయివారం రోజులు కేరళ టూర్ లోనే ఉన్నాడు. హాలిడేస్ ని ఎలా ఎంజాయ్ చేశారో చెప్పుకున్నారు కొద్దిసేపు.
“రిజల్ట్ వచ్చి ఉంటాయి కదా కాలేజీ కి వెళ్లి మెమోస్ తెచ్చుకుందామా ?” ఉత్సాహంగా అన్నాడు దీపు. ” అబ్బా .. ఇప్పుడే వచ్చాము కదా .. కొంచెం సేపు రెస్ట్ తీసుకో సాయంత్రం వెళ్ళొచ్చులే “అన్నాడు రహీం. ” ఏదన్నా మూవీకి వెళ్తామా? రేపు వెళ్ళొచ్చులే కాలేజ్ కి! ” అన్నాడు గురు. అసలు రిజల్స్ చూసుకోవాలనే ఆసక్తి లేదు గురుకి, ఖచ్చితంగా ఒకటో రెండో సబ్జక్ట్ గట్టెక్కడమే ఎక్కువ అని తెలుసు.
మొత్తానికి అందరినీ ఒప్పించి సినిమాకి ప్లాన్ చేసాడు గురు. దీపుకి, రహీం కి మూవీ కి వెళ్లడం పెద్దగా ఇష్టం లేదు, ఎందుకంటే హైదరాబాద్ లో ఉంటే వాళ్లకి మూవీస్, పబ్స్, అమ్మాయిలతో షికార్లు అన్నీ కామన్. ఆల్మోస్ట్ అన్ని మూవీస్ చూసేసారు. రహీం, దీపు బలవంతం చేస్తే ఈ మధ్యనే డ్రింక్ కూడా అలవాటయ్యింది గురుకి. సినిమా చూసి, పబ్ కి వెళ్లి డ్రింక్, డిన్నర్ చేసి వచ్చారు ముగ్గురూ.
నెక్స్ట్ డే కాలేజీ కి వెళ్లి రిజల్ట్ చూసుకున్నారు. దీపు సబ్జక్ట్స్ అన్ని క్లియర్ అయ్యాయి, రహీం ఒక సబ్జెక్టు తప్పింది, గురు ఒక్క సబ్జెక్టు మాత్రం క్లియర్ చేసుకోగలిగాడు. గురు మార్క్ షీట్ చూసి షాక్ అయ్యారు దీపు, రహీం. గురు లో పెద్దగా పశ్చాత్తాపం అయితే లేదు కానీ, లోపల కొంత బాధ మాత్రం ఉంది. అనుకున్నదే జరిగింది అన్నట్టు ఉన్నాడు. ఈ విషయం మాత్రం డాడీకి తెలియకూడదనుకున్నాడు. దీపు, రహీం లకి పూర్తి స్వేచ్ఛ ఉంది. చదవడం లోనే కాక, ఇష్టమైన పనులన్నీ చేయడంలో! ఇంకా చెప్పాలంటే అసలు వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరూ పట్టించుకోనంత! దీపుకి కొన్ని సార్లు వాళ్ళ నాన్న అడ్డు పడ్డా, అమ్మ మాత్రం ఎపుడూ ఏది అడిగితే ఆ కోరిక తీర్చేస్తుంది. ప్రతీది ప్రెస్టీజ్ ఇష్యూ లాగే చూస్తుంది కానీ, అది ఆ వయసులో, ఆ సమయంలో అవసరమా అని మాత్రం ఎప్పుడూ ఆలోచించదు.
ఒక రెండు నెలల కాలం అలా గిర్రున తిరిగింది. సంక్రాంతి హాలిడేస్ కోసం వారం రోజులు కాలేజీకి సెలవులు ప్రకటించారు.
“రహీం .. నెక్స్ట్ మంత్ వన్ వీక్ హాలిడేస్ వస్తున్నాయి కదా… ఏమి చేస్తున్నావ్?” ప్రతి హాలిడేస్ కి ఏదో టూర్ వెళ్ళే రహీం ఈసారి ఎక్కడికి వెళ్తున్నాడో అన్న ఆసక్తి తో అడిగాడు అప్పుడే క్లాస్ నుండి వచ్చిన దీపు.
“ఆ ఏముంది, ఈసారి చలి బాగా ఉంది, సిటీలోనే ఉండమంటున్నాడు మాపప్పా. ఎట్లాగూ మన మోటార్ సైకిల్ రేస్ గ్యాంగ్ వదలరుగదా నేను వెళ్తే …”సమాధానం ఇచ్చాడు రహీం.
” యా…మోటార్ సైకిల్ రేస్! ఐ లైక్ దట్. నీదే మోడల్ అన్నావ్?” తెలుసుకోవాలనే ఉత్కంఠతో అడిగాడు
దీపు. “హోండా సి బి ఆర్ 250 ఆర్ ” చాలా గర్వన్గా చెప్పాడు రహీం. “నీకో విషయం చెప్పనా, మా డాడీ టీవీఎస్ అపాచీ ఆర్ ఆర్ 312 ఆర్డర్ చేసాడు” సంతోషంగా చెప్పాడు
దీపు.
“వావ్ … అది 312 సీసీ, నేను కొనేప్పుడు స్టాక్ లేకుండే. వన్ వీక్ ఆగమంటే నేను ఆగలే” కొంచెం విచారంగా చెప్పాడు రహీం. “రహీం, నేను కూడా మీతో రేస్ కి రానా “జావాబు కోసం ఎదురు చూస్తున్నాడు దీపు. “అది చాలా డేంజర్ గేమ్, ముందు చాలా ప్రాక్టీస్ చెయ్యాలి, ఆ తర్వాతే రేసు”అన్నాడు రహీం .
రహీం కి చాల రోజుల నుండి రేసింగ్ ప్రాక్టీస్ ఉంది. ఓల్డ్ సిటీలో చాలా మంది రేసింగ్ ఫ్రెండ్స్ వున్నారు. దీపుకి రేసింగ్ అసలే ప్రాక్టీస్ లేదు. రహీంతో పరిచయం అయ్యాక హాలిడేస్ లో అర్ధరాత్రి దాటిన తర్వాత టోలీచౌక్ రోడ్లపై దిమ్మ తిరిగే రేసింగ్ చూసిన తర్వాత తనూ ఒక రేసింగ్ బైక్ కొనమని వాళ్ళ డాడీకి చెప్పడం, తండ్రి వద్దు అంటే, తల్లి చేత రికమండ్ చేపించి కొనడం అన్నీ జరిగి పోయాయి. ఎందుకంటే వాళ్ళ విల్లాస్ లో ఇటీవలే ఎవరో కొన్నారట, ప్రేజ్ ఇష్యూకోసం దీపు అడగగానే కొనేయమంది వాళ్ళ అమ్మ కానీ ఒక్క పలచగా ఉండే దీపుకి అంత పవర్పుల్ బైక్ ని నడిపే సామర్థ్యం ఉందో లేదో మాత్రం తెలుసుకోలేక పోయింది. ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్లాలా, కొత్త బైక్ నడపాలా అన్న ఉత్సాహంతో ఉన్నాడు దీపు. గురుకి మాత్రం సెలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు కూడా, అర్థం కాని ఆమెడికల్ పుస్తకాలతో కుస్తీ పడాల్సిందే, అది వాళ్ళ తండ్రి క్రమశిక్షణ మరి!
* * *
హైదరాబాద్ నగరం, ఒక వైపు పొద్దంతా కూలీ, ఉద్యోగాలు చేసిన వారు అలసిన శరీరాలతో ఇంటికి చేరి, రేపటి తమ బతుకు గురించి ఆలోచిస్తూ మంచి నిద్రలో ఉన్నారు. ఇంకో వైపు గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో తల్లి తండ్రుల సంపాదనని ఎలా ఖర్చుపెట్టాలా అన్నవెర్రి ఆలోచనలో మల్టీప్లెక్స్ ల చుట్టూ తిరుగుతూ, ఖరీదయిన జిమ్ముల్లో కొవ్వు కరిగించుకొని పబ్బుల్లో తాగి, తిని తిరిగే షోకిల్లా రాయుళ్లకు
అప్పుడప్పుడే రోజు మొదలయింది. వెర్రి పోకడలతో కొంత మంది రేవ్ పార్టీలకనీ బయలు దేరితే ఇంకొంత మంది మద్యం మత్తులో, మసాజ్ పార్లర్లలో, ఇంకొంత మంది రింగ్ రోడ్ కి ఆనుకుని ఉన్నటోలిచౌకి రోడ్ చేరుకున్నారు. అక్కడ ఎటు చూసినా వందల కొద్దీ రకరకాల మోటార్ సైకిల్స్, ఎన్నో మోడల్స్. దూసుకు పోతున్న బైకులు, ఒకడేమో ముందు చక్రాన్ని గాలిలో లేపుతూ ఒకే చక్రం పై అదీ వంద కిలోమీటర్ల కన్నా ఎక్కువ స్పీడ్ తో త్రోలుతూ. అమ్మాయిలు, అబ్బాయిలని ఏ మాత్రం తేడా లేదు, అందరూ ఉన్నారు ఆ గుంపులో. ఇంకొకడు కనీసం హెల్మెట్ కూడా లేకుండా నేలను తాకుతూ బైక్ ని లేపి వందల కిలోమీట్లర్ల స్పీడుతో పరుగెత్తిస్తున్నాడు. ఒకడు రెండు చేతులు వదిలేసి బైక్ తోలుతుంటే ఇంకొకడు మధ్య మధ్యలో బైక్ ని గాల్లోకి జంప్ చేయించడం, ఒక్కొక్కరు ఒక టైపు. చూస్తేనే కళ్లు తిరిగి పడి పోయే, గుండె దడ పుట్టించే ఆ స్పీడు. ఆకాశంలో దూసుకు పోయే రాకెట్ నేల మీద దూసుకు పోయినట్టు! గుండె జబ్బు ఉన్నవాళ్లకి మాత్రం ఆ స్పీడు చూస్తే తప్పని సరిగా గుండె నొప్పి రావాల్సిందే. అర్థ రాత్రి షిఫ్ట్ ముగించుకొని ఇంటికి వెళ్లే వాళ్లకి మాత్రం కొంత సేపు నరకం కనపడుతుంది ఆ రోడ్డు మీద. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే వాహనాలకి సైడ్ ఇవ్వకుండా సతాయిస్తారు. రోడ్డంతా వాళ్లదే! ఒంటరిగా వెళ్లే వాళ్లకు చుక్కలు చూపుతారు కొద్దిసేపు.
అవి సినిమాలో జరిగే చేజింగ్ సీన్ లకి ఏ మాత్రం తక్కువ కాకుండా జరిగే రేసులు. అడిగినవన్నీ కొనిచ్చి తమ బాధ్యత తీరిపోయింది అని పూర్తిగా పిల్లలని గాలికి వదిలే తల్లితండ్రులు. సంపాదనలో పడి జీవితం విలువలని తమ పిల్లలకి చెప్పేందుకు తీరిక లేని తల్లితండ్రులు, వినేందుకు ఓపిక లేని పిల్లలు. అవసరాలకు మించి డబ్బులు అందుతుంటే, ఎలా ఖర్చుచేయాలో తెలియక పెడదారులు పడుతున్న యువతకి నిలువెత్తు సాక్ష్యం ఈ బైక్ రేసర్లు. అది బాధ్యత తెలియని స్పీడు, జీవితపు భారం తెలియని స్పీడు. అందరూ బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు, సెలబ్రిటీస్, పొలిటీషియన్ ల పిల్లలు. రాత్రికి రాత్రి లక్షల కొద్దీ డబ్బు చేతులు మారుతుంది పందెం పేరుతో. ఇల్లీగల్ ఆక్ట్ కింద అరెస్టు చేసినా ఒక్క ఫోన్ కాల్ తో కొన్ని గంటల్లో బయటకు రావడమే కాక, అరెస్టు చేసిన పోలీసులకు ఏదో ఒక వేటు తప్పదు. అందుకనే పోలీసులు కూడా ఈ చోద్యాన్ని చూసీ చూడనట్టు వ్యవహరిస్తుంటారు.
సంక్రాంతి సెలవులకి వచ్చిన దీపు, రహీం దగ్గరికి కొత్తగా కొన్న టీవీఎస్ అపాచీ ఆర్ ఆర్ 312బైక్ తీసుకొని వచ్చాడు. అది అప్పుడప్పుడే మార్కెట్లోకి వచ్చిన బైక్. చాలా మంది రహీం ఫ్రెండ్స్ అభినందలతో ముంచి వేశారు దీపుని. అసలే రేసింగ్ లకి కొత్త, దానికి తోడు చాలా పవర్ ఫుల్ బండి అది. పొగడ్తలతో పొంగి పోయాడు దీపు. అందరూ ఏదో ఒక ట్రిక్ ప్లే చేస్తూ బైక్ రేసులు చేస్తుంటే తాను ఏదో చేయాలనుకున్నాడు.
యాభై వేల రూపాయల రేస్ మొదలవుతుంది, రహీం ఎంట్రీ డబ్బులు కట్టాడు. వెనుకాలే దీపు కూడా డబ్బులు కట్టడం రహీం ని ఆశ్చర్యానికి గురి చేసింది. వారించాడు రహీం. “రేసులు తర్వాత, ముందు బండి మెళుకువలు తెలుసుకో” అన్నాడు రహీం.
“నాకు దీని ఫీచర్స్ అన్నీ తెలుసు, బెంగుళూర్ లో ఉన్నపుడు ప్రతి రోజు అన్ని టెక్నిక్స్ యూట్యూబ్ లో నేర్చుకున్నాను” అన్నాడు దీపు ఒకింత కాన్ఫిడెంట్ గా. “యూట్యూబ్ లో చూసి ఎన్ని నేర్చుకోవట్లేదు రహీం, మొన్నటికి మొన్న మన హైదరాబాద్ లో యూట్యూబ్ లో చూసి గన్స్ కూడా తయారు చేశారు కదా” సాక్ష్యాలు చెప్పాడు దీపు కొనసాగింపుగా. ” ఫీచర్స్ తెలుసు కోవడం వేరు, వాటిని రియల్ గా ప్రాక్టీస్ చేయడం వేరు, ముందు కొంత ప్రాక్టీస్ చేయి, బండిని కంట్రోల్ చేయడం వెరీ ఇంపార్టెంట్, తర్వాత రేస్ చేద్దాం” సముదాయింపుగా అన్నాడు రహీం. ససేమిరా అన్నాడు దీపు. ఎంట్రీ డబ్బులు కట్టాడు. అంతే రేసు స్టార్ట్ అయ్యింది. ఇంత ప్రమాదకరమైన ఆట ఆడుతూ కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోరు ఎవరూ. అందరిలాగానే దీపు కూడా హెల్మెట్ పెట్టుకోలేదు, చాలా పట్టుదలగా ఉన్నాడు.
దాదాపు వంద మంది రేసర్లు పాల్గొంటున్నారు రేసులో. దాదాపు నలభై లక్షలు ఒక పది నిమిషాల్లో కలెక్ట్ చేసాడు ఆర్గనైజర్. ఇన్సక్షన్స్ చెపుతున్నాడు, ఎవరూ వినే పరిస్థితిలో లేరు, అందరికీ అన్నీ తెలిసినవే. రయ్,రయ్ మని ఎక్సలేటర్ల శబ్దంతో మారు మ్రోగుతుంది ఆ ప్రాంతం. ఆ పక్క నుండే రాత్రి రౌండ్స్ కి వచ్చిన పోలీసు జీబు చోద్యం చూస్తూ వెళ్లి పోయింది.
సమయం దాదాపు రాత్రి రెండు గంటలు కావస్తుంది. టోలిచౌకి నుండి, గచ్చిబౌలి మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు నుండి దాదాపు 30 కిలో మీటర్లు ప్రయాణించి ఎవరు ముందుగా బయలు దేరిన ప్రదేశానికి వస్తారో వారికి 10 లక్షల ప్రైజ్ మనీ. ఇక్కడ డబ్బుల కన్నా రేసులో గెలవడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, బీర్స్, చీర్స్ ల మధ్య రేసు మొదలయింది.
ఒక్కసారి వందలాది మోటార్ సైకిల్స్ స్టార్ట్ కాగానే అక్కడ భీకరమయిన శబ్దం. రోడ్డు పై మోటార్ సైకిల్స్ సునామీని తలపించింది. ఒక్కొక్కడూ ఒక స్టైల్ లో డ్రైవ్ చేస్తున్నారు. ఒకరిద్దరు బయలుదేరిన రెండు, మూడు నిమిషాల్లోనే అది తమకు పనికి రాదు అని పోటీ నుండి తప్పుకున్నారు. ఇంకొందరు బండి మొరాయించడం వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. ఒకరిద్దరు ఒకరికి ఒకరు తగిలి స్వల్ప గాయాలతో కింద పడిపోయారు.
దీపుకి ప్రాక్టీస్ లేకపోవడం, కొత్త వాతావరణం అయినా అందరితో స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాడు. రహీంకి చాలా రోజుల నుండి ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఏమాత్రం తడబడకుండా రేసులో దూసుకు పోతున్నాడు. ఒకర్ని కాదని ఒకరు బైక్ స్పీడ్ పెంచుతూ దూసుకు పోతున్నారు. ప్రతి పది కిలో మీటర్లకి ఒక చెక్ పాయింట్ ఉంటుంది. మొదటి చెక్ పాయింట్ అవుటర్ రింగ్ రోడ్డు ఎక్కగానే ఉంటుంది. రేస్ స్టార్ట్ అయిన మూడు నిమిషాల్లోనే చాలా మంది బైకర్లు ఔటర్ రింగ్ రోడ్డు మీదికి వెళ్లి పోయారు. క్లిక్ క్లిక్ మని కెమెరాలలో రింగ్ రోడ్డు పైకి ఎక్కిన ప్రతి రేసర్ బైక్ ఫోటో ఆర్గనైజర్ కి షేర్ చేయబడుతున్నాయి. మళ్లీ పది కిలోమీటర్ల తర్వాత రింగ్ రోడ్ నుండి గచ్చిబౌలి రోడ్ కి దిగేప్పుడు మరో చెక్ పాయింట్ ఉంటుంది. మొదటి ఆరు ,ఏడు నిమిషాల్లో చాలా మంది బైకర్లు రెండవ చెక్ పాయింట్ కూడా దాటేస్తారు. బైక్ చక్రాలు రోడ్డు మీద పరుగెడుతున్నాయో, గాల్లో తేలుతున్నాయో చెప్పడం చాలా కష్టం. దీపు ముందు చాలా బైక్స్ వెళ్లి పోయాయి, తాను ఇంకా మొదటి చెక్ పాయింట్ కూడా దాటలేదు. రహీం బైక్ కనుచూపు మేరలో లేదు,చెవిలో వైర్ లెస్ హెడ్ ఫోన్స్ తో మొబైల్ ఫోన్లో టచ్ లో ఉన్నారు రహీం, దీపు. రెండు సార్లు 12 నిమిషాల్లో రేస్ పూర్తి చేసి ప్రైజ్ మనీ గెలిచాడు రహీం. ఇప్పుడు టాప్స్ లో ఉన్నాడని అర్థం అయ్యింది దీపుకి. కొత్త చిక్కు వచ్చి పడింది దీపుకి. ఇప్పుడే రేస్ లో పార్టిసిపేట్ చేయకు అని చాలా సార్లు చెప్పినా వినలేదు,గెలవడం అటుంచి కనీసం టాప్10 లో కూడా రాడు అని అర్థం అయ్యింది. కనీసం మొదటి పది స్థానాల్లో ఉండాలి లేకుంటే రహీం ముందు ముఖం ఎత్తుకోలేనని అనుకున్నాడు దీపు. ఆవేశం ముంచుకు వచ్చింది. ఒకసారి రేర్ వ్యూ లో చూస్తే వెనుక కూడా చాలా బైక్స్ ఉన్నాయి, వాళ్ళని చూసి కొంత ధైర్యం, మరి కొంత ఉత్సాహం తెచ్చుకున్నాడు. అనుకున్నదే తడువుగా స్పీడు పెంచేసాడు, దూసుకుపోతున్నాడు, ఒక నిమిషంలో రింగ్ రోడ్ చెక్ పాయింట్ దాటివేశాడు.
“దీపు హైవే పైన చాలా డేంజర్ డోంట్ టేక్ రిస్క్, కంట్రోల్ కంట్రోల్ ” బైక్ సౌండ్ లో వచ్చిన మార్పుని గ్రహించి వారిస్తున్నాడు రహీం. “రహీం … క్రాస్ డ్ ఫస్ట్ చెక్ పాయింట్ హూ .. హూ ” చాలా సంతోషంగా ఉన్నాడు ఇంకా ఏమి వినే పరిస్థితిలో లేడు, స్పీడ్ ఇంకా పెంచేశాడు. వెనుక నుండి ఇంకా చాలా బైక్స్ కొన్ని వందల మీటర్ల దూరంలో. హైవే పై దీపు బైక్ ముందు రెండు ట్రక్కులు పోటీ పడి దూసుకు పోతున్నాయి, రెండు లైన్స్ బ్లాక్ చేయబడ్డాయి. షోల్డర్ నుండి ఓవర్టేక్ చేద్దామనుకుని బైక్ ని కొంచెం లెప్ట్ కి తిప్పుదామనుకున్నాడు, అంతే కంట్రోల్ తప్పింది, అసలే గంటకు నూట ముప్పై కిలో మీటర్ల స్పీడులో ఉన్న బైక్ గాల్లో పల్టీ కొట్టి షోల్డర్ ని గుద్ది దాదాపు ఇరవై అడుగుల దూరంలో రోడ్డు కింద పడి పోయింది. హెల్మెట్ కూడా లేని దీపు తల షోల్డర్ ని గుద్దికొని ఎక్కడో ఎగిరి పడ్డాడు.
క్షణాల్లోనే దీపు ప్రాణాలు అనంత వాయువుల్లో కలసి పోయాయి. ఏ ఒక్క రేసరి కూడా కనీసం ఏం జరిగిందో తెలియదు. ఎవరూ ఇంకొకడిని పట్టించుకునే పరిస్థితిలో లేరు. అసలే హైవే, పైగా చిమ్మ చీకటి, ఎవరి బ్రతుకు ఆరాటంలో వాళ్ళు – కార్లలో, బస్సుల్లో, ట్రక్కుల్లో.. పక్కనే విగత జీవిగా దీపు.
“దీపు …దీపు … అర్ యు ఒకే … ?” ఫోన్ లో అరుస్తున్నాడు రహీం. తన మాటలు తనకే వినిపిస్తున్నాయి, దీపు ఫోన్ ఎప్పుడో ముక్కలు,ముక్కలయింది.
* * *
రహీం ఫోన్ చేసి గురుకి అంతా చెప్పాడు, చాలా షాక్ అయ్యాడు గురు. దీపు అంత్యక్రియలకు గురు తన తండ్రితో కలసి వెళ్లి వచ్చాడు. రహీం ఒక్కడే ఇంకో ఫ్రెండుతో వచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు పట్టుకొని చాలా దుఃఖించారు. ఇద్దరూ జరిగిన విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. రోజూ కలిసి తిరిగే మిత్రుడు ఇక లేడు అనే విషయాన్ని తట్టుకోలేక పోతున్నారు. దీపు తల్లి తండ్రుల రోదన ప్రతి ఒక్కరిని కంట నీరు పెట్టిస్తుంది. ఒక్కడే కొడుకు, కోట్ల ఆస్తికి వారసుడు. “వాడికోసమే కదా రాత్రింబవళ్ళు కష్టపడింది. వాడే పోయిన తరువాత ఇప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి?” దీపు తండ్రి పడే వేదన అందరినీ కలసి వేసింది.
“వాడికి అడిగినవన్నీ కొనిస్తే సంతోషంగా ఉంటాడనుకున్నా, అందుకే మోటర్ సైకిల్ కూడా అడగగానే కొనించా, కానీ ఆ మోటార్ సైకిలే వానికి మృత్యువు అవుతదని ఊహించలేక పోయాను, వాడు రేసుల కోసం బైక్ కొన్నాడనే విషయం తెలుసుకోలేక పోయాను” అంటూ ఏడుస్తున్న వాళ్ళ అమ్మని ఓదార్చడం ఎవరి వాళ్ళ కావడంలేదు.
దీపు మరణం గురుని చాలా ఆలోచింపచేస్తుంది. ఆ షాక్ నుండి బయటకు రాలేకపోతున్నాడు. అంత్యక్రియల అనంతరం తన తండ్రితో కల్సి ఇన్నోవాలో కూర్చుని వెళుతున్న గురు ఎన్నో సందేహాలకు సమాధానం వెతుక్కుంటున్నాడు. రఘురాం కూడా మౌనంగా డ్రైవ్ చేస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. మాటలేమీ లేకుండానే ఇల్లు చేరారు. దీపు తల్లి శారద రోదిస్తూ అంటున్న ప్రతి మాట రహీంకి తననే అంటున్నట్టు అనిపించింది.
రహీం కి వాళ్ళ అమ్మ మాటలు గుర్తుకి వచ్చాయి, చాలా సార్లు చెప్పింది రేసింగ్ మంచిది కాదు అని, కానీ ఎప్పుడన్నా వింటే కదా! ఆ గుండె కోత ఎలా ఉంటుందో ఇప్పుడు తెలిసి వచ్చింది. దీపు మరణానికి పరోక్షంగా కారణం తనే అని లోలోపల ఎంతో కుమిలి పోతున్నాడు రహీం. దీపు చనిపోవడం బాధాకరమయిన విషయం అయినప్పటికీ, రేస్ లో చనిపోయాడని విషయం తెలిసి కనీసం సానుభూతి కూడా తెలుపని వాళ్ళు కొందరు. తల్లి తండ్రులు ఇచ్చిన అలుసే ఈ రోజు ఒక నిండు ప్రాణం బలయ్యింది అని ఇంకొకరు దీపు తల్లి తండ్రులని బాధ్యులని చేయడం రహీం ని ఆలోచింప చేసింది. “బాగా కొవ్వు ఎక్కి ఇట్లాంటి ఆటలు ఆడితే చివరకు మిగిలేది బూడిదే” ఒక దారిన పోయే దానయ్య మాటలు గునపాల్లా కుచ్చుకున్నాయి రహీం గుండెల్లో. ఆ ప్రమాదం తనకు జరిగి ఉంటే …? వాళ్ళ తల్లి తండ్రుల శోకం ఎలా ఉంటుందో ఊహల్లోనే భరించలేక పోయాడు.
పిల్లలు చేసే పొరపాటుకు తల్లితండ్రులు మాటలు పడడం అనేది ఊహించలేక పోయాడు. అమ్మ ఏమి చెప్పి నా ఆమె చదువుకోలేదనే ఒక చిన్న కారణంతో ప్రతిదీ ఎగతాళి చేసినట్టు మాట్లాడేవాడు. కానీ జీవితం నేర్పే పాఠాల కన్నా పెద్ద చదువు ఏదీ లేదనే విషయం ఈ రోజు తెలుసుకున్నాడు. అమ్మ ఎంత బాధపడిందో ఇన్ని రోజులు! తమ సుఖం కోసం తన తండ్రి అందరిని వదలి ఎక్కడో ఉంటున్నాడు. ఇప్పటికే కోట్ల ఆస్తి ఉంది, వ్యాపారాల్లో నెల తిరగకుండానే వచ్చే రాబడి ఉంది. సుఖపడాల్సిన ఈ వయసులో ఇలా మా అందరినీ వదలి ఎక్కడో ఉండడం, రాత్రనక పగలనకా కష్టపడడం ఎందుకు అని మొట్టమొదటగా తన తండ్రి ని గురించి ఆలోచించాడు. ఈ సారి పప్పా రాగానే “ఇక సంపాదించింది చాలు, నేను కూడా చదువుకొని నా జీవితానికి సరిపడా సంపాదించనివ్వండి, ఇప్పుడు మీకు విశ్రాంతి అవసరం” అని చెప్పాలని గట్టి నిర్ణయానికి వచ్చాడు. ఇప్పటినుండి అవసరానికి తప్ప రేసులకోసం బైక్ ని ముట్టకూడదనుకున్నాడు. కాలేజీలో మార్కుల కోసం తండ్రి పలుకుబడిని ఎలా ఉపయోగించాడో ఆలోచిస్తే ఇప్పుడు తనపై తనకే అసహ్యం వేస్తుంది. ఇంటికి వెళ్లి ఎక్కడో మూలన పడేసిన హెల్మెట్ తీసి శుభ్రం చేసుకోవడం వాళ్ళ అమ్మని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎప్పుడూ టిఫిన్ చేసి బయటకు వెళ్ళమంటే తినకుండా వెళ్లి బయట ఫ్రెండ్స్ తో ఏ రెస్టారెంట్ కో వెళ్లే రహీం, ఈరోజు బయటనుండి వచ్చి “అమ్మ టిఫిన్ ఏముంది? “అని అడగడం ఆమెని మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. అసలేమి జరిగిందో తెలియక పోయినా, కొడుకులో వచ్చిన ఈ మార్పుకి మాత్రం లోలోపల చాలా సంతోషించింది.
“వాడి కోసమే కదా రాత్రింబవళ్ళు కష్టపడింది” దీపు తండ్రి మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి గురుకి. ఈ రోజు దీపు మరణం కేవలం స్పీడ్, అదుపుతప్పి పోవడమేనా? అడ్డు అదుపూ లేకుండా పెంచిన తల్లి తండ్రుల నిర్లక్షమా? ఈ పరిస్థితికి దారి తీసిన అసలు కారణం ఏమిటి? అవును కష్టపడాలి, సంపాదించాలి.
కానీ ఎంత? ఒక మనిషి సుఖపడాలి అంటే ఎన్ని కోట్లు కావాలి? ఒక్క పిల్లవాణ్ణి పెంచాలంటే ఎంత డబ్బు కావాలి? ఒక కోటి, రెండు కోట్లు… వంద కోట్లు? డాడీ, ఈ సమ్మర్ హాలిడేస్ లో ఫారిన్ టూర్ వెళామా అంటే, అబ్బే నాకు బిజినెస్ మీటింగ్స్ ఉన్నాయి, నువ్వు అమ్మ వెళ్ళండి అనే తండ్రి. అమ్మని అడిగితే నాకు స్కూల్ వర్క్ ఉంది వీలు కాదు అంటుంది. కనీసం ఒక రోజు కలసి భోజనం చేయడానికి కూడా సమయం దొరకని బిజీ పేరెంట్స్. పాపం! దీపు పబ్ కి వెళ్ళినప్పుడన్నా చెప్పి బాధ పడే విషయాలు ఒక్కటొక్కటీ గుర్తుకొస్తున్నాయి గురుకి.
ఒక తండ్రి తన పిల్లలకి విద్యాబుద్దులు చెప్పిస్తే వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటారు కదా? వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకుంటారు కదా? తమ పిల్లల సంపాదన, ఆ పిల్లలకి పుట్టబోయే పిల్లల సంపాదన కూడా మేమే చేస్తాం అనే తల్లితండ్రులు, అది తమ పిల్లల జీవితాలు బాగుపడడానికా?లేదా ఇలా తమ పిల్లల జీవితాలతో ఆడుకోవడానికా? విద్యాబుద్ధులు అంటే ఖరీదు అయిన చదువే అని నమ్మే తన తండ్రి లాంటి వారు మరొక వైపు పిల్లల భవిష్యత్తును కాలరాయడం లేదా? కావాల్సిన ప్రేమ, సంతోషం తల్లి తండ్రులనుండి రానప్పుడు దీపు లాంటి పిల్లలు సంతోషాన్ని క్లబ్బుల్లోనూ, పబ్బుల్లో నూ,మోటార్ సైకిల్ రేసు ల్లోను చూసుకోక ఏమి చేస్తారు? తరాలు తిన్నా తరగని సంపాదన ఉన్నప్పుడు, ఇంకా నేను సంపాదించి ఏమి చేయాలి అనే ఆలోచన జల్సాలకు, చెడు సాహవాసాలకు దారితీయడం లేదా? సంపాదించడం ఎలా అని నేర్పించక, తమ జీవితాంతం తిన్నా తరగనంత సంపాదించి ఇచ్చే తల్లితండ్రులున్నంత వరకూ దీపు లాంటి వాళ్ళు, రహీం లాంటి వాళ్ళు జీవితంలో ఏదో ఒక తప్పటడుగు వేయక ఏంచేస్తారు? ఇప్పటివరకూ తన తండ్రి చెప్పిన మాటలు, స్కూల్, కాలేజీల్లో తన టీచర్లు చెప్పిందే ఆలోచించడం అలవాటు చేసుకున్న గురు మొట్టమొదటి సారి తనకు తానుగా స్వంతంగా ఆలోచిస్తున్నాడు.
ఇద్దరూ ఇంటికి వచ్చి స్నానం చేసి డైనింగ్ రూంకి రాగానే డిన్నర్ రెడీ చేసింది వాళ్ళ అమ్మ గౌరి. ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా డిన్నర్ చేస్తున్నారు. “బక్క పలచగా వున్న ఆ పిల్లోడికి అంత పవర్ ఫుల్ బైక్ కొనివ్వడం తప్పు కదా, అంత నిర్లక్ష్యంగా ఏది అడిగితే అది కొనివ్వడమేనా? అయినా అది వాడికి ఎంతవరకు అవసరమో తల్లి తండ్రులు ఒకసారి ఆలోచించాలి అడగగానే కొనివ్వకుండా” అన్నాడు గురు తండ్రి రఘురామ్ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ. ఎప్పటి నుంచో తన తండ్రికి చెప్పాలనుకున్న మాటలు వెంటనే గుర్తుకు వచ్చాయి గురుకి, ఇదే అదనుకున్నాడు.
“డాడీ, దీపు కెపాసిటీ అంచనా వేయకుండా అంత బైక్ కొని ఇచ్చారు అంటున్నారు కదా, మరి మీ కొడుకు కెపాసిటీని, ఇష్టాన్ని తెలుసుకొనే మెడిసిన్ లో చేర్పించారా?” ఎక్కడలేని ధైర్యంతో అన్నాడు గురు. డాడీ తో ఇలా మాట్లాడే ధైర్యం ఎలా వచ్చిందా అని ఒక్కసారి షాక్ కి గురి అయ్యింది గౌరి.
“ఏంట్రా .. అలా అన్నావ్? ముందు నుండీ నీవు మెడిసిన్ ఇష్టం అన్నావు కదా” కొంచెం షాక్ నుండి తేరుకొని అన్నాడు రఘురామ్. “నీ ఇష్టాన్ని నాపై బలవంతంగా రుద్దావు, ప్రతి సారీ మెడిసిన్ కన్నా మించిన కోర్సు లేదు అని నన్ను హిప్నటైజ్ చేసావు. నేను మ్యాథమెటిక్స్ లో టాప్, బయాలజీ అసలే ఇష్టం లేదు. నన్ను ఒకసారన్నా మెడిసిన్ ఇష్టమా అని అడిగావా డాడీ?” గట్టిగానే అన్నాడు గురు.
ఒకసారి అన్నీ గుర్తుకు తెచ్చుకున్నాడు రఘురామ్, అవును వాడిని ఒక్కసారి కూడా నీకు ఏది ఇష్టం అని అడగకుండా తానే బలవంతంగా మెడిసిన్ లోచేర్పించాడు. తన వాలెట్ లో దాచుకున్న మార్క్ షీట్ తీసి ఇచ్చాడు గురు తండ్రికి. మీరు ఒక స్పోర్ట్స్ మాన్, ఎంతో క్రమ శిక్షణతో నన్ను పెంచారు, నేను ఎక్కడా మీ మాట దాటలేదు. నాకు మీలా స్పోర్ట్స్ ఆడే సమయం ఇవ్వలేదు, నాకు ఇంట్రస్ట్ కూడా క్రమంగా తగ్గిపోయింది. సివిల్స్ రాసి గ్రామాల్లో నిరుద్యోగ యువతకి కొంతలో కొంత నా వంతు సహాయం చేద్దామనుకున్నాను. నా ఇష్ట ఇష్టాలని ఒక్కసారి కూడా కనుక్కోకుండా నన్ను బలవంతంగా మెడిసిన్ లో చేర్పించారు” కళ్ళలో నీళ్లు తురుగుతుండగా అక్కడి నుండి వెళ్లి పోతుంటే, దగ్గరకు తీసుకుంది గౌరి. చిన్న పిల్లాడిలా ఒదిగి పోయాడు అమ్మఒడిలో గురు.
అనుకోకుండా ఎదురయిన ఈ పరిస్థితికి ఒకింత ఆశ్చర్యానికి గురి అయిన రఘురామ్, గురు వెళ్లిన వైపే చూస్తూ ఆలోచనలో పడ్డాడు. మార్కుల లిస్ట్ చూసి ఖంగుతిన్నాడు. అప్పుడు గానీ అర్థం కాలేదు రఘురాంకి తాను చేసిన తప్పేమిటో! కొంతసేపు మౌనం రాజ్యమేలింది వారిమధ్య. రఘురామ్ కి దీపు వాళ్ళ నాన్న వేదన అంతా కళ్ళ ముందు తిరుగుతుంది. కోట్ల ఆస్తి, కొన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని సంపద, కానీ కన్న కొడుకు లేడు. ఈ రోజు తన కొడుకు తన కళ్ళ ముందు ఉన్నాడు, మర్యాదగా తన బాధ్యతని గుర్తు చేసాడు. ఇంకా తన ఇష్టాలను వాడిపై రుద్దాలనుకోలేదు. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు. విచారంగా వాళ్ళ అమ్మ ఒడిలో ఒదిగిన గురు భుజం పై చేయి వేసాడు. హృదయంలోని దుఃఖం, కనీళ్ల రూపంలో బయటకొస్తుంటే బలవంతంగా ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు గురు. ఆపుకుంటే ఆగిపోయేదా ఇన్నాళ్ళుగా గుండెలో గూడు కట్టుక పోయిన ఆ దుఃఖం! వెంటనే లేచి హత్తుకున్నాడు వాళ్ళ డాడీని.
“గురు, లే! ఇంత చిన్న విషయానికి ఎందుకురా అంత బాధ పడతావ్? అవును, అందరి తండ్రుల లాగే నువ్వు ఒక డాక్టరువి కావాలని ఆశ పడ్డాను. స్పోర్ట్స్ మన్ గా రాణించాలంటే, పైకి రావాలంటే అంత ఈజీ కాదు. అన్ని అర్హతలుండీ కూడా రికమండేషన్స్ లేకపోవడం వల్ల వెనుదిరిగి పోయిన వాళ్ళని ఎందరినో చూసాను, అందుకే నాకు ఇష్టమయిన స్పోర్ట్స్ లో కాకుండా మెడిసిన్ లో చేర్పించాను. అప్పుడే “డాడీ నేను మెడిసిన్ చదువను, ఇంజనీరింగ్ చదువుతాను లేదా ఇంకేదో చేస్తాను” అని ఒక్క మాట చెపితే సరిపోయేది కదా! సరే ఇప్పటికీ ఏమి మునిగి పోలేదు. పోయింది ఒక సంవత్సరమే కదా…! ఈ సారి నీకు ఇష్టమయిన కోర్సులో చేరుదువు కానీ, డబ్బులంటావా..? మళ్ళీ సంపాదించుకుందాం! ఈ విషయంలో నీవేమీ బాధపడకు” భరోసా ఇచ్చాడు రఘురామ్. రఘురాంలో వచ్చిన ఈ మార్పుకి చాలా సంతోష పడింది గౌరి. తండ్రి కొడుకుల అనుబంధం చూసి ముచ్చటేసింది గౌరికి.
“థ్యాంకూ డాడీ, నా వలన ఇప్పటికే చాలా నష్టపోయారు, ఇంకెప్పుడూ కొత్త వెహికల్ కావాలి అని కూడా అడగను, నాకిష్టమయిన చదువు చదివిస్తా అన్నారు, అది చాలు” తేలికయిన హృదయంతో హత్తుకున్నాడు తండ్రిని.
ఆ స్పర్శ ఇప్పుడు చాల కొత్తగా, హాయిగా ఉంది రఘురాంకి. మెడిసిన్ సీటుకి కట్టిన కోటి రూపాయల గురించి ఆలోచించడం లేదు, మార్కుల మెమోలో ఎన్ని సబ్జెక్ట్ పాసయ్యాడో పట్టించునే పరిస్థితిలో అసలే లేడు. ఇప్పుడు కొడుకు ఏమి చదవాలి, చదివి ఎంత సంపాదించాలి అని కూడా ఆలోచించడం లేదు. కేవలం తన కొడుకు కళ్ళ ముందు ఉంటే చాలు, వాడి ఇష్టమయిన చదువు చదివి, వాడి జీవితానికి సరిపోయే కొంత సంపాదన వస్తే చాలు అని ఆలోచించడం తప్ప.
***