సినీ ధ్రువతార రాలిపోయింది. సుదీర్ఘకాలం వెండితెరపై సంచలనాలు నమోదు చేసిన ఓ సినీ దిగ్గజం ఇక శాశ్వతంగా సెలవు తీసుకుంది. అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) కన్నుమూశారు. ఆ సినీతారకు నివాళి అర్పిస్తోంది నక్షత్రం ప్రొడక్షన్స్, పిలుపు-చానల్-ఎన్ యాజమాన్యం మరియు టీమ్.
విజయనిర్మల ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు. మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం విజయనిర్మల కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు నరేష్ ఒక్కడే సంతానం.
సాక్షి చిత్రంతో తొలిసారిగా సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించిన ఆమె ఆయనతో 47 చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, మలయాళంలో 200కుపైగా చిత్రాల్లో విజయనిర్మల నటించారు. సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణ పతాకంపై 15కుపైగా చిత్రాలను నిర్మించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా మీనా చిత్రాన్ని తెరకెక్కించారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారు.
తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆమె అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును (2008) అందుకున్నారు. మీనా, కవిత, దేవదాసు, దేవుడు గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, కిలాడీ కృష్ణుడు, బోగిమంటలు, పుట్టింటి గౌరవం, నేరము శిక్ష ఆమె దర్శకత్వం వహించిన చిత్రాల్లో ముఖ్యమైనవి.
ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ..