మౌనసాక్షి పుస్తకంపై వరప్రసాద్ సమీక్ష
మిత్రుడు వేణుగోపాల్ గారికి,
ముందుగా మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు !!
నేను అడిగిన వెంటనే మీ ‘మౌనసాక్షి’ (ఒక మంచి పుస్తకం) పంపించినందుకు ధన్యవాదములు !!
ఏ పుస్తకం అయినా ఒకసారి చదివి పక్కన పెట్టి కొంతకాలం తరువాత మళ్లీ చదువడం నాకు అలవాటు కానీ మౌనసాక్షి ఒకసారి చదివాక ప్రత్యేకంగా కొన్ని కథలు మల్లీ చదవాలనిపించింది , అంతగా ఆకట్టుకున్న అంశాలు కథలోని వస్తువు, మీరు చెప్పిన శైలి.
మౌనసాక్షిలో కేవలం పదకొండు కథలే ఉన్నా ఒక్కొక్కటి ఒక్కో నక్షత్రం, మీ కథలలో నాకు బాగా నచ్చిన అంశాలు మీరు చెప్పాలనుకున్న విషయం సూటిగా చెప్పడం, చుట్టు జరుగుతున్న విషయాల పట్ల, చుట్టూ ఉన్న మనుషుల పట్ల , జీవితం పట్ల ధృడమైన నమ్మకమూ, సమాజం పట్ల మికున్న గౌరవం, సమస్యలపై మరియూ కథకు ఎంచుకున్న వస్తువు పైన మీ లోతైన విశ్లేషణ, ఇవి మీ ప్రతికథలోనూ ప్రస్ఫూటంగా కనిపిస్తున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.
చుట్టూ మనుషులరూపంలో మృగాలు ఉంటున్నాయన్న నిజాన్ని తెలుసుకోలేక ప్రాణం మీదకు తెచ్చుకున్న కాంతమ్మ కథ ‘మృగాలమధ్య’ ఆలోచింప చేసే కథ , తల్లితండ్రులు పిల్లల చదువుల పట్ల శ్రద్ద చూపిస్తున్నాం అనుకుని గ్రేడు లకోసం , మంచి స్కూలు లేదా కాలేజీలో సీటు కోసం హింసిస్తున్న తీరు దాని పర్యవసానం ఆ పిల్లవాడి ఆలోచన ఎటువైపు మల్లిస్తుందో చాలా చక్కగా ‘వేక్ అప్ !’ లో ఆవిష్కరించారు.
సమాజంలో మానవత్వం ఎంతలా క్షీణించిందో చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యం ‘మౌనసాక్షి ‘
‘ నాతిచరామి ‘ అని పెళ్లిపీటలమీద అగ్ని సాక్షిగా – అందరి సాక్షిగా జీవితాంతం తనతో ఉంటానని ప్రమాణం చేసిన భర్త చిన్న కారణం చూపించి వేరే పెళ్లిచెసుకుంటాను అన్నప్పుడు ఆ అమ్మాయి పడే అవేదన , అతని లో మార్పు వస్తుందేమో అని ప్రయత్నించిన విధానం , ఇక తను చేసేదేమీ లెదనుకున్నప్పుడు అమ్మయి తిసుకున్న నిర్ణయం చాలా బాగుంది.
ధనార్జనే ధ్యేయంగా కన్న బిడ్డ బారసాల కూడా జరిపే సమయం లేక పుట్టిన నెల తిరక్కముందే పొత్తిల్లల్లో పసికందులను ఇండియా ఎగుమతి చేస్తున్న ఈ కాలం స్మార్ట్ తల్లి తండ్రులకు చక్కని ‘ పిలుపు ‘
ఇలా చెప్పుకుంటూ పోతే ‘పర్యవసానం’, ‘అశ్రువొక్కటి’ ప్రతీ ఒక్క కథ ఆలోచింపచేసే ఆణిముత్యమే.
నేను ఇంతకముందు మీ కథలు చదవలేదు, బహుశా ఇలా పుస్తకరూపంలో మంచి కథలు అన్నీ ఒకేసారి చదవడం కోసమే వేచి ఉన్నానేమో…ఇంకా ఇలాంటి ఎన్నో కథలు, పుస్తకాలు మీ కలం నుండి జాలువారాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ….
– వరప్రసాద్ కార్యంపూడి
…………………………………
మిత్రుడు వరప్రసాద్ గారు “మౌనసాక్షి” చదివి అన్ని కథలకు అద్భుతంగా రాసిన సమీక్ష మీ కోసం…
ఇలాంటి సమీక్షలే కదా ఏ రచయితకయినా మరింత ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చేది.
ధన్యవాదములు వరప్రసాద్ Varaprasad Karyampudi గారు, మీరు ఆశించినట్టుగా మరిన్ని మంచి కథలు రాయడానికి ప్రయత్నిస్తాను.
-వేణు నక్షత్రం (రచయిత)